Russia Invansion | ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ఖండిస్తుంటే.. చైనా మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. రష్యాను కట్టడి చేయడానికి అమెరికా, దాని మిత్రపక్ష దేశాలు విధించిన ఆంక్షలను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తప్పుబట్టారు. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కరించడానికి రష్యాపై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించిన ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా లేవని సోమవారం మీడియాతో అన్నారు.
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం పరిష్కారంలో చైనా, ఇతర పక్షాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించొద్దని అమెరికాను వాంగ్ వెన్బిన్ డిమాండ్ చేశారు. రష్యాను, రష్యన్ బ్యాంకులను `సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సియల్ టెలీ కమ్యూనికేషన్ (స్విఫ్ట్) సేవల నుంచి బహిష్కరిస్తూ అమెరికా మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్య ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కేవలం ఆటంక పరుస్తుందని వాంగ్ వెన్బిన్ అన్నారు.
రష్యా, రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ సేవలనుంచి బహిష్కరించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం సారధ్యం వహించింది. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా స్విఫ్ట్ సేవల నెట్వర్క్ నుంచి ఈయూ దేశాలు బహిష్కరించాయి. భారత్‌తోపాటు 200కి పైగా దేశాల్లో స్విఫ్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల బ్యాంకులకు స్విఫ్ట్ సేవలు లభిస్తున్నాయి. స్విఫ్ట్ సేవలతో అంతర్జాతీయ ఆర్థిక సేవలు స్మూత్‌గా సాగుతున్నాయి.