Beijing Expands Mass Testing | తాజాగా కరోనా కేసులు పెరుగడంతో షాంఘైలో వలే కఠిన లాక్డౌన్ అమలు చేయాల్సి వస్తుందన్న భయం చైనా రాజధాని బీజింగ్ అధికారుల్లో కొనసాగుతున్నది. బీజింగ్‌లో 2.1 కోట్ల మందికి సామూహిక కొవిడ్-19 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనాకు పుట్టినిల్లయిన చైనా.. దాని ఆట కట్టించేందుకు పూర్తిగా లాక్డౌన్ విధించి, సామూహిక పరీక్షలు నిర్వహించడంతోపాటు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.
చైనాలో అతిపెద్ద సిటీ షాంఘై కొన్ని వారాలుగా లాక్‌డౌన్‌లోనే మగ్గుతున్నది. ఇటువంటి పరిస్థితి వస్తుందేమోనని చాలా మంది భయ పడుతున్నారు. షాంఘైలో పరిస్థితులు ఇలా మారుతాయని ఎవరూ ఊహించేదని బీజింగ్ వాసి జావో అంటున్నారు. బీజింగ్‌లో పరిస్థితి ఇబ్బందికరంగా లేకున్నా బియ్యం, నూడుల్స్, ఆహార ధాన్యాలు, ఆయిల్ కొనుగోలు చేశాం. రెండు వారాలకు సరిపడా సామగ్రి కొని తెచ్చుకున్నాం అని అన్నారు.
బీజింగ్ పరిధిలోని 12 సెంట్రల్ జిల్లాల వాసులకు మూడు రౌండ్ల టెస్టింగ్ జరుపనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో అత్యధిక జనాభా గల చావోయాంగ్లో తొలుత సోమవారం నుంచి టెస్ట్‌లు ప్రారంభించారు. మిగతా 11 నగరాల్లో మంగళవారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెస్టింగ్ చేస్తారన్న వార్తలు రావడంతో ప్రజలంతా తమ అవసరాలకు సరిపడా నిల్వలు కొని పెట్టుకుంటున్నారు.
చావోయాంగ్లోని కొన్ని నివాస ప్రాంతాలను అధికారులు సీల్ చేసేశారు. ఎక్కడికక్కడ కంచెలు వేయడంతో కాస్త ఆందోళన కలుగుతున్నదని స్థానికులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కనీసం 14 రోజులు ఇంటికి పరిమితం కావాలని సోమవారం రాత్రి స్థానికులు తెలిపారు. మరోవైపు బీజింగ్‌లో భారీ సభలు, వివాహ వేడుకలను సస్పెండ్ చేశారు. కొన్ని నిర్మాణ ప్రాజెక్టు పనులను సస్పెండ్ చేశారు.