Afghanistan : అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లు విద్య, స్వేచ్ఛ వంటివి కనీస హక్కుల్ని అక్కడి అమ్మాయిలకు దూరం చేస్తున్నారు. ఈమధ్యే అఫ్గాన్ అమ్మాయిలు యూనివర్సిటీల్లో చదువుకోవడంపై నిషేధం విధించారు. దాంతో చాలామంది మహిళలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గళం వినిపిస్తున్నారు. తాజాగా మర్వా అనే 19 ఏళ్ల అమ్మాయి తన ఆక్రోషాన్ని వెల్లగక్కింది. కాబూల్‌లోని తన ఇంటి నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘యూనివర్సిటీ విద్యపై నిషేధం బదులు ఆడవాళ్ల తల తీసేయండని వాళ్లు ఆదేశాలు ఇస్తే బాగుండేది. ఒకవేళ మాకు చదువుకునే హక్కు లేకుంటే.. మేము అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేదని కోరుకుంటా. ఈ ప్రపంచంలో ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు నేను బాధపడుతున్నా. మమ్మల్ని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు. జంతువులు సొంతంగా తమకు నచ్చిన ప్లేస్‌కు వెళ్తాయి. కానీ, మా దేశంలోని అమ్మాయిలకు ఇంటి నుంచి బయటకు వచ్చే హక్కు కూడా లేదు ‘ అని ఆమె తన బాధను వెల్లడించింది.
మర్వా అంతగా బాధపడడకానికి కారణం ఏంటంటే.. వాళ్ల కుటుంబంలో యూనివర్సిటీ చదువు వరకు వచ్చిన మొదటి తరం అమ్మాయి తనే. మర్వా ఈమధ్యే మెడికల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష పాస్ అయింది. మరికొన్ని నెలల్లో కాబూల్ యూనివర్సిటీలో నర్సింగ్ డిగ్రీలో చేరేది. బాగా చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్న మర్వా లాంటి ఎందరో అమ్మాయిల కలలు ఇప్పుడు కల్లలు అయ్యాయి. తాలిబాన్ల నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేయడం ఇస్లాంకు వ్యతిరకేమని కొన్ని ముస్లిం దేశాలు అభిప్రాయపడ్డాయి.
కాలేజీ, యూనివర్సీటీల్లో చదువుకునే అమ్మాయిలు డ్రెస్‌కోడ్ పాటించడం లేదని, వాళ్లు ఇస్లాం పద్ధతులు, అఫ్గానిస్థాన్ సంస్కృతిని కించపరిచేలా ప్రవరించారని ఆ దేశ విద్యాశాఖ మంత్రి నదీమ్ ఆరోపించారు. అందుకనే ఉన్నత విద్యకు అమ్మాయిలను అనుమతించకూడదని తాలిబాన్లు నిర్ణయం తీసుకున్నారు.