దోహా: బాలుడ్ని కుక్క కరిచిందని ఆగ్రహించిన కొందరు వ్యక్తులు తుపాకులు చేతపట్టి కుక్కలపై కాల్పులు జరిపారు. దీంతో 29 కుక్కలు మరణించగా మరికొన్ని గాయపడ్డాయి. కలకలం రేపిన ఈ సంఘటనపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. ఈ దారుణ సంఘటన ఖతార్‌లో జరిగింది. సెక్యూరిటీ ఉన్న ఫ్యాక్టరీపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గన్స్‌తో బెదిరించి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఉన్న వీధి కుక్కలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో కొన్ని పిల్లలతో సహా 29 కుక్కలు చనిపోయాయి. మరికొన్నింటికి బుల్లెట్ గాయాలయ్యాయి.
కాగా, పావ్స్ అనే రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ బుల్లెట్ గాయాలైన కుక్కలకు చికిత్స అందిస్తున్నది. ఈ సంఘటనపై ఆ సంస్థ మండిపడింది. ఆయుధాలు ధరించిన కొందరు బలవంతంగా ఫ్యాక్టరీలోకి చొరబడి అక్కడ స్వేచ్ఛగా జీవించే మూగజీవాలైన వీధి కుక్కలపై కాల్పులు జరిపి అమానుషంగా చంపారని ఆరోపించింది. తీవ్రంగా గాయపడిన కొన్ని కుక్కలు, పప్పీలు పశు వైద్యశాలలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గన్స్‌తో కాల్పులు జరిపి కుక్కలను దారుణంగా చంపిన వారిపై ఖతార్ ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఖతార్ సురక్షిత దేశమేనా? అని ప్రశ్నించారు.