న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీపై హత్య దరిమిలా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు ప్రజ్వరిల్లిన నేపథ్యంలో మరో కీలక నాయకుడిపై కాల్పులు జరిగాయి. విద్యార్థుల సారథ్యంలోని నేషనల్ సిటిజెన్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నాయకుడు మహ్మద్ మొతాలెబ్ సిక్దర్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఖుల్నా జిల్లాలో సోమవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎన్సీపీకి చెందిన కార్మిక విభాగం జాతీయ శ్రామిక్ శక్తికి కేంద్ర నిర్వాహకుడిగా సిక్దర్ పనిచేస్తున్నట్లు ఎన్సీపీ ఖుల్నా మెట్రోపాలిటన్ విభాగం నిర్వాహకుడు సయీఫ్ నవాజ్ తెలిపారు. డివిజన్లో కార్మికుల ర్యాలీకి సన్నాహాలు చేసుకుంటున్న సిక్దర్పై కాల్పులు జరిగాయని, తలలో ఎడమ వైపున బుల్లట్ తగిలిందని, ప్రస్తుతం దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్నారని నవాజ్ చెప్పారు.
బంగ్లాదేశ్లో ప్రస్తుత హింసాత్మక ఘటనలకు ముహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వమే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. ఉగ్రవాద శక్తులను రెచ్చగొట్టి భారత వ్యతిరేక ప్రచారాన్ని యూనుస్ ప్రభుత్వం ఎగదోస్తోందని ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత్ పట్ల పెరుగుతున్న ఘర్షణపూరిత వైఖరి, భారతీయ దౌత్యవేత్తల భద్రతపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాజా ఉద్రిక్తతలు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని ఆరోపించారు. మీడియా కార్యాలయాలపై, మైనారిటీ హిందువులపై దాడులను ఆమె ఖండించారు. తనను, తన కుటుంబాన్ని దేశం విడిచి పారిపోయేలా చేసింది కూడా వీరేనని ఆమె చెప్పారు.