Awami League | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి షాక్ తగిలింది. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్‌పై నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద చర్యలు తీసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని అధికారిక నోటిఫికేషన్ ద్వారా జారీ చేయనున్నట్లు పేర్కొంది. అవామీ లీగ్, ఆ పార్టీ నాయకులపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT)లో కొనసాగుతున్న విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది.
షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా.. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ దశాబ్దాలుగా తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్)లో బెంగాలీ మాట్లాడే ప్రజల హక్కుల కోసం ఆందోళన చేసింది. ఆ తర్వాత 1971 విముక్తి యుద్ధానికి నాయకత్వం వహించింది. ఇప్పుడు ఈ పార్టీపై ఉగ్రవాద చట్టం కింద చర్య తీసుకోవడం గమనార్హం. ఇది బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా పేర్కొంటున్నారు.