బ్రసీలియా: బ్రెజిల్లో తోకతో ఓ అరుదైన శిశువు జన్మించింది. ఫోర్టాలెజా నగరంలోని ఆల్బర్ట్ సాబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పురుడు పోసుకున్న ఆ శిశువుకు 12 సెంటీమీటర్ల తోక.. దాని చివరన ఓ చిన్న బంతిలాంటిది ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తోకను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆ తోక ‘నిజమైన మానవ వాలమని’ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా తోకతో శిశువులు పుట్టడం అరుదైన విషయమని, ఇప్పటివరకు ఇలాంటివి 40 కేసులు మాత్రమే నమోదయ్యాయని అంటున్నారు. తోకలో ఎముకలు గానీ, మృదులాస్థికలు గానీ లేవని తెలుస్తున్నది. గడువుకు ముందే 35 వారాలకు జన్మించిన పాప ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ తోకలాంటిది ఉండడంతో శస్త్రచికిత్స అవసరమైంది.