Turkey Earthquake | తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. కొన్ని దృశ్యాలైతే హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కొందైరే పుట్టుకతోనే కుటుంబాన్ని కోల్పోతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో జిండేరిస్ ప్రాంతం ఒకటి. అక్కడ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భూకంపం వచ్చిన కాసేపటికి ఆ బిడ్డ తల్లికి పురిటి నొప్పులు వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చనిపోయింది. ఆ పాప తండ్రి, నలుగురు తోబుట్టువులు కూడా శిథిలాల కింద చతికిపోయి ప్రాణాలు వదిలారు.
సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్న సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నెమ్మదిగా మట్టిని, రాళ్లను తొలగించి ఆ పసికందును సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ‘పాపకు ప్రథమ చికిత్స అందించాం. శిశువు ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి. తీవ్రమైన చలి వల్ల పాపకు హైపోథెర్మియా వచ్చింది. చిన్నారిని కొంత వెచ్చ చేసి, కాల్షియం అందించాల్సి వచ్చింది’ అని వైద్యుడు హానీ మారూఫ్ వెల్లడించారు.
చిన్నారికి అయా (Aya) అని నామకరణం చేశారు. అయా అంటే అరబిక్‌లో ‘మిరాకిల్’ అని అర్థం. ఇంతటి ఘోరవిపత్తులో ప్రాణాలతో బయటపడినందుకు శిశువుకు ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం చిన్నారి ఆలనాపాలనా వైద్యుడు హానీ మారూఫ్ భార్యే చూసుకుంటోంది. తమ కూతురితో సమానంగా పాలు పడుతున్నట్లు వైద్యుడు తెలిపారు.
కాగా, అయా పరిస్థితి తెలుసుకున్న చాలా మంది ప్రజలు చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు వైద్యుడు మారూఫ్ తెలిపారు. ‘చిన్నారిని దత్తత తీసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. నాకు డజన్ల కొద్దీ కాల్స్ వస్తున్నాయి. అయితే, నేను చిన్నారిని దత్తత తీసుకోవడానికి ఎవరినీ అనుమతించను. అయా బంధువులు తిరిగి వచ్చే వరకు.. తనని నేనే పెంచుతా. నా కన్న కూతురులా చూసుకుంటా’ అని వైద్యుడు మారూఫ్ స్పష్టం చేశారు. చిన్నారిని శిథిలాల కింద నుంచి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.