న్యూఢిల్లీ: అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు(Azerbaijan Plane) చెందిన విమానం.. కజకస్తాన్‌లో కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 38 మంది మరణించారు. అయితే ఆ విమానాన్ని రష్యన్ మిస్సైల్ ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్.. ఆ విమానాన్ని ఢీకొట్టడం వల్లే అది కూలినట్లు మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు.
విమానంలోని ఫ్యూసిలేజ్ ఏరియాలో పడిన రంధ్రాల ఆధారంగా ఆ అంచనా చేస్తున్నారు. విమాన తోక భాగంలో ఉన్న గుర్తులు కూడా ఆ అనుమానాలకు తావిస్తోంది. మిస్సైల్స్ నుంచి వెలుబడే పదునైన వస్తువులతో డ్యామేజ్ అయిన రీతిలో తోక భాగం దెబ్బతిన్నట్లు అచంనా వేస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్లు ఎక్కువ సంచరిస్తున్న ప్రాంతంలో అజర్బైజాన్ విమానం దాడికి గురైందని అంటున్నారు.
విమాన శిథిలాలను గమనిస్తే, అది యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్ ప్రభావం వల్ల జరిగే నష్టానికి సమానంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ ఆ విమానాన్ని తాకి ఉంటుందని ఓ రష్యా మిలిటరీ బ్లాగర్ అభిప్రాయపడ్డాడు. విమానం పేలడానికి ముందు దాని తోక భాగంలో ఉన్న ప్రయాణికులకు భారీ శబ్ధం వినిబడినట్లు చెబుతున్నారు. విమానంలోని ఆక్సిజన్ ట్యాంకు పేలి ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు అంచనా వేశాయి.
పక్షి ఢీకొనడం వల్ల విమానం కూలి ఉంటుందని తొలుత ప్రకటించిన అజర్బైజాన్ విమానయాన సంస్థ ఆ తర్వాత తన ప్రకటనను వెనక్కి తీసుకున్నది. మిస్సైల్ తాకినట్లు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది.