Australian man | ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు, అతని పెంపుడు కుక్క పసిఫిక్ మహా సముద్రంలో చిక్కుకున్నారు. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 60 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. ఆ రెండు నెలల పాటు సముద్రంలో దొరికే పచ్చి చేపలను తింటూ, వర్షపు నీటిని తాగుతూ బతికేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన నావికుడు టిమ్ షాడుక్(51), అతని పెంపుడు కుక్క బెల్లా కలిసి మెక్సికోలోని లా పాజ్ నగరం నుంచి 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఫ్రెంచ్ పాలినేషియాకు చేరేందుకు ప్రయాణమయ్యాడు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, టిమ్ పడవలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముందుకు కదల్లేకపోయాడు టిమ్. తన కుక్కతో పాటు అతను కూడా పడవలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా 60 రోజుల పాటు సముద్రంలో దొరికే చేపలను తింటూ ఆకలి తీర్చుకున్నాడు. వర్షపు నీటిని తాగుతూ బతికేశాడు. కుక్కకు కూడా అదే ఆహారాన్ని అందించాడు టిమ్.
జులై 12వ తేదీన టిమ్‌ను అతని పెంపుడు కుక్కను మెక్సికన్ ఫిషింగ్ ట్రాలర్‌కు సంబంధించిన నిఘా హెలికాప్టర్ గుర్తించింది. అనంతరం వారి పడవ వద్దకు వెళ్లి.. వారిని అధికారులు చేరదీశారు.
ఈ సందర్భంగా టిమ్ మాట్లాడుతూ.. రెండు నెలల పాటు సముద్రంలో చిక్కుకుపోతామని ఊహించలేదు. పచ్చి చేపలను, వర్షపు నీటిని తాగుతూ బతికాం. అలల ధాటికి పడవలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దెబ్బతిన్నాయి. ఎవర్నీ కాంటాక్ట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం విరామం అవసరం. మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని టిమ్ చెప్పుకొచ్చాడు.