కీవ్, జూన్ 8: రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడుల్లో అనేకమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖేర్సన్, లుహాన్స్ (రష్యా ఆక్రమిత ప్రాంతం)లో ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ బాంబు దాడులను చేపట్టగా, ఈ యుద్ధంలో సదోవా అనే చిన్న పట్టణం నలిగిపోయింది. ఉక్రెయిన్ బలగాలు శుక్రవారం జరిపిన క్షిపణి, బాంబు దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో 60 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని మాస్కో ఆధీనంలో పనిచేస్తున్న గవర్నర్ వ్లాదమిర్ సాల్దో శనివారం ప్రకటించారు.
అమెరికా ‘హిమార్స్’ మిస్సైళ్లు, ఫ్రాన్స్ తయారీ గైడెడ్ బాంబులతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడ్డాయని సాల్దో చెప్పారు. సదోవా పట్టణంపై ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా పదే పదే దాడులకు తెగబడిందని, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని ఉక్రెయిన్ ఈ దాడిని చేపట్టిందని ఆయన ఆరోపించారు. బాంబు దాడులతో భవనాలు కుప్పకూలగా, శిథిలాల కింద చిక్కుకున్న మరో రెండు మృతదేహాలను శనివారం వెలికి తీశామని ఆయన చెప్పారు.