టొరంటో: కెనడాలోని టొరంటోలో శ్రీ జగన్నాథుని రథయాత్రపై దాడి జరిగింది. భక్తి పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ వీధిలో వెళ్తున్న భక్తులపైకి ఓ భవనంపై నుంచి కోడి గుడ్లు విసిరారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇది అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ, ఇటువంటి హేయమైన చర్యలు పండుగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఈ పండుగ ఐకమత్యం, అందరినీ కలుపుకొనిపోవడం, సామాజిక సామరస్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఈ దాడికి పాల్పడినవారిని చట్టానికి జవాబుదారీ చేయాలని కెనడా అధికారులను కోరినట్లు చెప్పారు. కెనడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.