న్యూఢిల్లీ, జూన్ 11: హొర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడం సంచలనంగా మారింది. కేవలం నాలుగు రోజుల్లో మూడు నౌకలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఓ ఘటనలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు.
తమ నిబంధనలు పాటించట్లేదంటూ కారణం చెప్పి యూఎస్ మిలిటరీ దాడులు నిర్వహించడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దాడులపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దాడులకు గురైన నౌకలన్నీ విదేశాలకు చెందినవే అని.. మొదట దాడి జరిగిన రెండు నౌకలు పలావు దేశానికి చెందినవి కాగా.. గురువారం దాడికి గురైనది గినియా బిసావు దేశానికి చెందినదని వెల్లడించారు. దాడులకు గురైన వాటిల్లో ఇండియాకు చెందినవి లేవన్నారు. ఈ విషయంపై యూఎస్ డిచార్జర్ను పిలిపించి సమన్లు జారీ చేశామని.. వెంటనే దాడులను ఆపాలని చెప్పామని అన్నారు.
జూన్ 11న ఒమన్‌లో గినియా బిసావు దేశానికి చెందిన ట్యాంకర్ మీద అమెరికా బలగాలు దాడులు చేయగా.. ముగ్గురు భారత నావికులు మృతి చెందారు. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా.. అధికారులు 21 మందిని రక్షించగా.. ముగ్గురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ నుంచి చమురు తీసుకువస్తుండగా ఈ ట్యాంకర్ మీద యూఎస్ దాడులు జరిపింది. ఈ ట్యాంకర్ మీద ఆంక్షలు ఉన్నాయని.. రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో తమ సూచనలు పాటించకుడా వెళ్లడంతో దాడులు చేసినట్టు యూఎస్ మిలిటరీ వెల్లడించింది.
గురువారం జరిగిన దాడిపై ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాడికి గల కారణాలపై వివరణ కోరింది. భారత నావికులపై జరుగుతున్న దాడులను ఉపేక్షించబోమని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ థాంక్స్ చెప్పడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘ట్రంప్‌నకు ప్రధాని థ్యాంక్స్ చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? భారత నావికులను యూఎస్ బలగాలు దాడులు చేసి చంపుతున్నందుకా? భారత పరిస్థితి దయనీయంగా మారినందుకా? మన దేశ పరిస్థితి అత్యంత అవమానకరంగా మారిపోయింది. దేశానికి బలమైన నాయకత్వం అవసరం. దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు’ అని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మోదీ పాలన 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రంప్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అందుకు మోదీ థ్యాంక్స్ చెప్పారు.