కాఠ్మాండూ : నేపాల్ వరదల్లో విషాదం రోజురోజుకూ పెరుగుతోంది. వరదల బీభత్సానికి ఇప్పటి దాకా 939 మంది చనిపోగా.. సోమవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. 4వేల మంది కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ఆ దేశంలోని 8 ప్రభావిత జిల్లాల్లో మృతదేహాలను వెలికితీస్తున్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమానీనదం కూలిపోవడంతో ఒక్కసారిగా బురద, రాళ్లు, మంచు, నీళ్లు, కొండచరియలు కలిసి దిగువన ఉన్న ఊర్లను తుడిచిపెట్టేశాయి. ఆగస్టు 26న ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురి చేసిన ఆ వరదలు.. అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. నేపాల్ డిజాస్టర్ రిస్క్ అండ్ మేనేజ్మెంట్ వివరాల ప్రకారం.. చిత్వాస్లో 279 మంది, నవల్పరాసి ఈస్ట్‌లో 216 మంది, నవల్పరాసి వెస్ట్‌లో 168 మంది, నువాకోట్‌లో 95 మంది, గోర్ఖాలో 65 మంది, ధాదింగ్లో 55 మంది, తనాహులో 38, రసువాలో 23 మృతదేహాలు వెలికితీశారు.
విద్యుత్ ప్రాజెక్టుల్లో 939 మంది గల్లంతు
నేపాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 939 ఉద్యోగులు, కార్మికులు ఆగస్టు 26 నుంచి కనిపించకుండా పోయారు. ఇందులో అనేక మంది సొరంగాల్లో చిక్కుకుని పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 600 మందికి పైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లోని సొరంగాల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఎన్డీఆర్ఆర్ఎమ్ఏ తెలిపింది. ఇప్పటి దాకా వివిధ ప్రాజెక్టుల సొరంగాల నుంచి 279 మందిని రక్షించారు.
అప్పర్ త్రిశూలి-1 నుంచి 254 మందిని రక్షించగా.. ఈ ప్రాజెక్టు సొరంగాల్లో 500 మందికి పైగా ఇంజినీర్లు, కార్మికులు కనిపించకుండా పోయారు. అలాగే అప్పర్ త్రిశూలి-3లో 213 మంది, రసువాగాధిలో 42 మంది కనిపించట్లేదు. లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టు సొరంగం నుంచి 18 మందిని రక్షించారు. సొరంగాల్లో 90 మందితో కూడిన సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందాలు సొరంగాల ప్రధాన భాగానికి చేరుకుని ఆరు చదరపు అడుగుల మేర రంధ్రాలు చేసి లోపలికి దిగుతున్నారు. రంధ్రాలు మరిన్ని చేసేందుకు భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలను వాడుతున్నారు.