యాంగాన్: మయన్మార్‌లో ఘోరం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రం జడే మైన్ వద్ద ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి గాయాలయ్యాయి. మరో 70 నుంచి 100 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దాదాపు 200 మంది సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరికొంత మంది సమీపంలోని సరస్సులో బోట్ల సాయంతో వెతుకుతున్నారు. కాగా, మయన్మార్‌లోని గనుల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. కచిన్ రాష్ట్రంలో మొత్తం 300 గనులు ఉండగా.. ఎప్పుడూ ఏదో ఒక గని ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.