మాడ్రిడ్: స్పెయిన్‌లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో దావానలం(Spain Wildfire) చెలరేగుతోంది. అండలూసియన్ ప్రాంతంలో సుమారు 12 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దాదాపు 150 మంది ఫైర్‌ఫైటర్లు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్మేరియాలోని లాస్ గల్లార్డోస్లో కార్చిచ్చు వ్యాపిస్తున్నది. దక్షిణ యూరోప్‌లో గత కొన్ని రోజుల నుంచి 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో ఎండ తీవ్రత వల్ల అడవులు అంటుకుంటున్నాయి. దీంతో ఫైర్‌ఫైటర్లు ఆ కార్చిచ్చును ఆపే ప్రయత్నంలో ఉన్నారు. వేల సంఖ్యలో జనం తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
దావానలం వల్ల మృతిచెందిన బాధితుల మృతదేహాలు కార్లలోనే ఉన్నాయి. రాత్రి పూట మంటలు వ్యాపించడంతో.. ఎటువెళ్లాలో తెలియని స్థితిలోకి ప్రజలు వెళ్లిపోయారు. మంటల వల్ల రోడ్లను మూసివేశారు. కార్చిచ్చును ఆపేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ప్రధాని పెడ్రో సాంచేజ్ తెలిపారు. స్పెయిన్ మిలిటరీ ఎమర్జెన్సీ యూనిట్.. లాస్ గల్లార్డోస్కు అగ్నిజ్వాలల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నది. 1950 తర్వాత స్పెయిన్‌లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 10 లక్షల ఎకరాల అడవి అంటుకున్నది. గత 20 ఏళ్లలో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువగా తేలింది.