లండన్: బ్రిటన్‌కు చెందిన కంపెనీల్లో గత ఏడాది అత్యధిక జీతం అందుకున్న వారిలో ఆస్ట్రాజెనికా సీఈవో ( AstraZeneca CEO ) పాస్కల్ సోరియట్ ఉన్నారు. నిజానికి ఆ దేశ కంపెనీల్లో చాలా వరకు సీఈవోల జీతాలు అయిదోవంతు పడిపోగా.. ఆస్ట్రాజెనికా సీఈవో జీతం మాత్రం అత్యధికంగానే ఉన్నట్లు ఓ నివేదిక చెప్పింది. ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో ఆ కంపెనీ సీరంతో కలిసి కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నది. ఇక యూరోప్‌లో వాక్స్జ్వెరియా పేరుతో ఆ కంపెనీ టీకాలు పంపిణీ అవుతున్నాయి. వాస్తవానికి మహమ్మారిని నిలువరించడంలో సీఈవో సోరియట్ విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నా.. అతను మాత్రం గత ఏడాది సుమారు 150 కోట్ల (21.25 మిలియన్ల డాలర్లు) జీతం ఆర్జించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల వివిధ రంగాలకు చెందిన కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఆ నష్టాన్ని కంపెనీ పెద్దలు కూడా భరించాలని బ్రిటన్‌లో షేర్హోల్డర్లు డిమాండ్ చేస్తున్నారు.