కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ దేశ సైన్యానికి పరాభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. వేగం తగ్గిన రష్యా సైన్యం తీరు పట్ల కూడా పుతిన్ అసహనంతో ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. సైనిక అధికారులు ఇస్తున్న సమాచారంతో పుతిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎన్బీసీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. చాలా ఆవేశం, కోపంతో కింద స్థాయి సైనికాధికారులపై పుతిన్ విరుచుకుపడినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన రిపోర్ట్‌లో చెప్పింది. సాధారణంగా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే పుతిన్.. తమ దేశ సైన్యం నత్తనడకను వెళ్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఒంటరిగా మారుతున్న పుతిన్‌కు.. తన సబార్డినేట్స్ తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై పుతిన్‌కు అవగాహన ఉండదని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
తాము వేసుకున్న ప్రణాళిక కన్నా రష్యా దళాలు.. వెనుకబడి ఉన్నట్లు తేలిందని అమెరికా సేనేటర్ క్రిస్ మర్ఫీ అన్నారు. సెక్యూర్టీ బ్రీఫింగ్‌కు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని ఆయన బయటపెట్టారు. రష్యా సైనిక సామాగ్రి, లాజిస్టిక్స్ అంశంలో విఫలమైనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సప్లయ్ లైన్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయని, కానీ రాబోయే రోజుల్లో కీవ్‌లో రష్యా తిష్టవేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఇక ఆ సమయంలో అక్కడ తీవ్ర రక్తపాతం తప్పదన్నారు. కీవ్ కోసం పోరు చాలా సుదీర్ఘంగా సాగుతుందని, పెను విధ్వంసం, రక్తపాతం అనివార్యమవుతుందన్నారు. ఉక్రేనియన్లు వీధి పోరాటాల కోసం ప్రిపేరవుతున్నట్లు మర్ఫీ తెలిపారు. మరో వైపు అమెరికాతో పాటు కూటమి దేశాలు పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేసే ప్రక్రియలో మునిగాయి. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే ఫండ్ కోసం బిల్లును పాస్ చేసేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది.