
జెరూసలేం, నవంబర్ 9: మోతాదుకు మించి తాగి తీవ్రమైన హ్యాంగోవర్లోకి వెళ్లినవాళ్లు ఉపశమనం కోసం బ్లడిమెరీస్ కాక్టెయిల్ లేదా పచ్చి గుడ్లను తీసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే, క్రీస్తుశకం మూడో శతాబ్దానికి చెందిన ఇజ్రాయెల్ వాసులు హ్యాంగోవర్‌ను తగ్గించుకునేందుకు ఓ బంగారు ఉంగరాన్ని ఉపయోగించేవారని పరిశోధకులు తాజాగా గుర్తించారు.
ఆ దేశంలోని యవ్నే నగరంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఓ బంగారు ఉంగరం బయటపడిందని, లోతుగా విశ్లేషిస్తే.. హ్యాంగోవర్‌ను తగ్గించుకునేందుకు మందుబాబులు ఈ ఉంగరాన్ని వేలికి పెట్టుకునేవారని పేర్కొన్నారు. ఊదారంగు రాయి ఉన్న 5.11 గ్రాముల ఈ బంగారు ఉంగరం నిజంగా హ్యాంగోవర్‌ని తగ్గిస్తుందో లేదో తెలియాల్సి ఉన్నదన్నారు. కాగా, హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి పురాతన గ్రీకులు లారెల్ ఆకులను మెడలో ధరించేవారు.