వాషింగ్టన్, జూలై 21: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో మంగళవారం రోడ్డుపై జరిగిన ఓ ఘర్షణలో భారత సంతతికి చెందిన కొత్తగా పెండ్లయిన యువకుడు గవిన్ దాసర్ (29) మృతి చెందాడు. ఆగ్రాకు చెందిన గవిన్ తన మెక్సికన్ భార్యతో కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గవిన్‌కు వివియానా జమోరాతో గత నెల 29న పెండ్లి జరిగింది. ఓ కారు డ్రైవర్‌తో జరిగిన ఘర్షణలో జరిగిన కాల్పుల్లో గవిన్ ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక సాక్షి తీసిన వీడియోలో గవిన్ కారు డ్రైవర్‌పై కోపంతో అరుస్తున్న దృశ్యం కనిపించింది. గవిన్ తన చేతిలోని తుపాకీతో కారు తలుపును తట్టగానే కారు డ్రైవర్ మూడుసార్లు గవిన్పై కాల్పులు జరిపాడు. వెంటనే గవిన్ కుప్పకూలిపోయాడు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అనుమానితుడిని ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత అతడిని వదిలేశారు. నిందితుడు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.