Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన 24 గంటల్లోపే మరో హిందూ వ్యాపారిని చంపేశారు. నర్సింగ్డీ జిల్లాలో కిరాణ షాపు నిర్వహించే వ్యాపారిని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ వరుస ఘటనలో బంగ్లాదేశ్‌లో ఆందోళన రేకెత్తిస్తుంది.
నర్సింగ్డీ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్సింధూర్ బజార్లో మణి చక్రవర్తి కిరాణ దుకాణం నిర్వమిస్తున్నారు. సోమవారం రాత్రి అతను షాపులో ఉండగా కొద్దమంది దుండగులు షాపులోకి చొరబడ్డారు. అనంతరం పదునైన ఆయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు.. తీవ్రంగా గాయపడిన మణి చక్రవర్తిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మణి చక్రవర్తి ప్రాణాలు కోల్పోయాడు. బంగ్లాదేశ్‌లో హిందువులపై తరచూ ఇలాంటి దాడులు జరగడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మణి చక్రవర్తి హత్యకు కొద్ది గంటల ముందు జర్నలిస్టు రాణా ప్రతాప్ బైరాగిని దారుణంగా హత్య చేశారు. జెస్సోర్ జిల్లా కేశవ్‌పూర్ గ్రామానికి చెందిన దైనిక్ బీడీ ఖబర్ పత్రికకు బైరాగి యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే మణిరాంపూర్‌లోని కొపాలియా బజార్లో ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్నాడు. సోమవారం ఫ్యాక్టరీ దగ్గరకు బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు బైరాగిని బటయకు పిలిచారు. అనంతరం పక్కనే ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి తుపాకీతో మూడుసార్లు కాల్చారు. అనంతరం అతని గొంతు కోసి చంపేశారు.