న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఉక్రెయిన్ జెండాలను చేబూనిన పౌరులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హిట్లర్, హంతకుడిగా అభివర్ణిస్తూ నిరసనలు చేపట్టారు. శాంటియాగో, చిలీ, లిథువేనియా వంటి పలు ప్రాంతాల్లో ప్రజలు ఉక్రేనియన్ జెండాతో ప్రదర్శనలు నిర్వహించారు.
ఆందోళనకారులు మరికొన్ని చోట్ల ఉక్రెయిన్ జాతీయ గీతం ఆలపించారు. విదేశాల్లో నివసించే ఉక్రేనియన్లు తమ ఆత్మీయుల క్షేమం కోసం ప్రార్ధనలు చేశారు. ఇక న్యూయార్క్‌లో నిరసనకారులు ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని నినదించారు. టైమ్స్క్వేర్తో పాటు రష్యన్ ఫెడరేషన్ మిషన్ వద్ద గుమికూడిన నిరసనకారులు తక్షణం యుద్ధాన్నినిలిపివేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఉక్రెయిన్ జాతీయ పతాకాలతో నిరసనకారులు వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. పుతిన్ చర్యలను వ్యతిరేకిస్తూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయాలని రష్యాను డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రకటించిన మరుక్షణం నుంచే రష్యన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం పెల్లుబికింది.