ఒట్టావా, మే 14: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. కొత్త మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన నలుగురికి స్థానం కల్పించారు. అనితా ఆనంద్‌ను విదేశాంగ శాఖ మంత్రిగా, మణీందర్ సిద్ధూను అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా నియమించారు. అమెరికా-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి పునరుద్ధరణకు ప్రధాని కార్నీ కీలకమైన శాఖలను వీరిద్దరికీ అప్పగించారు. నేరాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర కార్యదర్శిగా రూబీ సాహ్తాను, అంతర్జాతీయ అభివృద్ధి కోసం రాష్ట్ర కార్యదర్శిగా రణదీస్ సారాయ్ను నియమించారు.
సీనియర్ రాజకీయవేత్త అయిన ఆనంద్ గతంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కెనడా లిబరల్ పార్టీకి చెందిన 58 ఏండ్ల అనితా ఆనంద్ హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చేతపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా తర్వాత అనితా ఆనంద్ కూడా ప్రధాని పదవికి పోటీపడ్డారు. అనంతరం ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. అనితా ఆనంద్ తల్లిదండ్రులు 1960లలో భారత్ నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. వ్యాపారవేత్త అయిన 41 ఏండ్ల సిద్ధూ 2019 నుంచి బ్రాంప్టన్ ఈస్ట్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.