వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాలు 2026లో సాయుధ ఘర్షణకు దారి తీసే అవకాశాలున్నాయని అమెరికా మేధో సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సాయుధ పోరు జరిగే అవకాశాలను మితమైన సంభావ్యతగా విదేశీ సంబంధాల మండలి(సీఎఫ్ఆర్) అభివర్ణించింది. ఇది అమెరికా ప్రయోజనాలపై తక్కువ ప్రభావాన్ని చూపొచ్చని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ కావడం ఇరు దేశాల మధ్య సాయుధ సంఘర్షణ జరిగేందుకు కారణం కావొచ్చని అంచనా వేసింది. ఇరు దేశాలు ఇటీవల డ్రోన్లు, క్షిపణులతో కూడిన అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నాయి.
కాల్పుల విరమణ కుదిర్చారంటూ రిక్కీ గిల్‌కు అవార్డు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, భారత సంతతికి చెందిన రంజిత్ రిక్కీ గిల్‌కు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విశిష్ట కార్యాచరణ పురస్కారాన్ని ట్రంప్ సర్కార్ అందజేసింది. పహల్గాం ఉగ్రదాడి క్రమంలో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు జరిపి కాల్పుల విరమణకు కృషి చేశారని పేర్కొంటూ ఆయనకు ఈ అవార్డును అందజేశారు.