టెహ్రాన్: ఇరాన్, అమెరికా దళాల మధ్య భీకర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే టెహ్రాన్‌లోని ప్రధాన వీధిలో ఉన్న ఓ బిల్బోర్డ్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నది. అమెరికాకు హెచ్చరికలు ఇవ్వడంలో ఇరాన్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. చేపల వల పట్టుకున్న ఇరానీ సైనికుల ఫోటో(Iran Fishing Net) ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ చేపల వలలో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు చిక్కినట్లు భారీ బోర్డును పెట్టారు. టెహ్రాన్ వీధిలో ఉన్న ఆ బిల్‌బోర్డు పై ఫార్సి భాషలో రాతలు రాశారు. ఆ భారీ బోర్డు ముందు ఇద్దరు ఆఫీసర్లు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో రిలీజైంది. హోర్ముజ్ జలసంధిని ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటుందని, యావత్ పెర్షియన్ గల్ఫ్ ప్రాంతం తమకు వేట ప్రాంతమని దాంట్లో రాసి ఉంది. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రెవల్యూషన్ స్క్వేర్ వద్ద ఆ ఫోటో పెట్టారు.
మరో వైపు ఇవాళ హోర్ముజ్ జలసంధిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. హోర్ముజ్‌లో కమర్షియల్ షిప్పింగ్ అనుమతి అంశంలో ఆ ఓటింగ్ జరగనున్నది. అయితే హోర్ముజ్‌లో మిలిటరీ దళాలను మోహరించడాన్ని చైనా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వీటో అధికారం ఉన్న చైనా నిర్ణయం కీలకం కానున్నట్లు చెబుతున్నారు. ఇరాన్, అమెరికా దళాల మధ్య యుద్ధం ఇప్పటికే అయిదు వారాలు దాటింది. హోర్ముజ్‌ను మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలి ఓటింగ్ చేపట్టనున్నది.