వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించమని లక్షలాది అమెరికన్లు శనివారం రోడ్లు, వీధుల్లో నినదించారు. ఆయనకు, ఆయన పరిపాలన, విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 50 రాష్ర్టాలలోని 2,500కు పైగా ప్రాంతాల్లో నో కింగ్స్(రాజులు లేరు) నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ నిరంకుశత్వాన్ని తమ నిరసన సవాల్ చేస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. తన పాలనకు ఎదురులేదని ట్రంప్ భావిస్తున్నారని నో కింగ్స్ నిరసన నిర్వాహకులు తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. అమెరికాలో రాజులు లేరు. అరాచకానికి, అవినీతికి, క్రూరత్వానికి మేము లొంగేది లేదు అని నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే ఇవి అమెరికా విద్వేష నిరసనలని కొందరు రిపబ్లికన్లు అభివర్ణించారు. నేషనల్ గార్డులను బయటకు రప్పించాల్సిన సమయం ఆసన్నమైందని కన్సాస్ సెనేటర్ రోజెర్ మార్షల్ చెప్పారు.
ఇవి ఆంటిఫాతో ముడిపడిన ప్రదర్శనలు కావడంతో నేషనల్ గార్డు బలగాలు అవసరమని ఆయన తెలిపారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని తాను ఆశిస్తున్నప్పటికీ అనుమానమేనని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తలపెట్టడాన్ని డెమోక్రాట్లు కూడా ఖండించారు. ట్రంప్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లక్షలాదిమంది ప్రజలు ఎక్కడికక్కడ సమూహాలుగా ఏర్పడి రోడ్ల మీద నిరసనలు తెలియచేస్తున్నారు. అయితే తాను చక్రవర్తిని కాదని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఆదివారం ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను ఫాక్స్ న్యూస్ ప్రసారం చేసింది. నిరసనకారులు తనను చక్రవర్తిగా సంబోధిస్తున్నారని, కాని తాను చక్రవర్తిని కానని ట్రంప్ తెలిపారు. కాగా, ప్రధాన నగరాలలో హైవేలపైకి చేరుకున్న నిరసనకారులు ప్లకార్డులు చేతిలో పట్టుకుని నిరసన తెలియచేస్తున్నారు. చిన్న పట్టణాలు నుంచి మహా నగరాల వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ చక్రవర్తి కాదని, ఆయన నిరంకుశ పాలన అమెరికాలో చెల్లదని నిర్వాహకులు ప్రకటించారు.
నో కింగ్స్ కేవలం ఓ నినాదం కాదని, ఆ పునాదిపైనే మన దేశ నిర్మాణం జరిగిందని నోకింగ్స్.ఆర్గ్ వెబ్సైట్ పేర్కొంది. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డైగో, అట్లాంటా, న్యూయార్క్, హూస్టన్, టెక్సాస్, హొనోలులు, బోస్టన్, మిస్సైరీ, బోజ్బాన్ మోంటానా, చికాగో, న్యూ ఆర్లియన్స్ తదితర నగరాలలో నిరసనలు జరిగే ప్రదేశాలను నిర్వాహకులు గుర్తించారు. పసుపు రంగు దుస్తులు ధరించి నిరసనల్లో పాల్గొనాలని నిరసనకారులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. జార్జియా రాజధాని టిబిలిసికి ర్యాలీగా వెళ్లేందుకు అట్లాంటా సివిల్ సెంటర్ వద్దకు 10,000 మందికి పైగా నిరసనకారులు చేరుకున్నారు. తాము అమెరికాను ప్రేమిస్తామని, ఓ రాజుకు తమ దేశాన్ని అప్పగించలేమని జన సమూహాన్ని ఉద్దేశించి వక్తలు ప్రకటించారు.
రాజ్యాంగం నిర్దేశించిన చట్టాల ప్రకారం పాలన జరగాలని, నిరంకుశ పాలనను తాము అంగీకరించబోమని నిరసనకారులు ప్రకటించారు. చట్టం కన్నా ఎవరూ అధికులు కారని, అలాగే తక్కువ కూడా కారని వారు పేర్కొన్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్కేర్ వద్దకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ సమీపం వరకు జరిగే నిరసన ర్యాలీకి వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ నాయకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలలో అతి భారీ ప్రదర్శన వాషింగ్టన్ డీసీలో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరసన ర్యాలీలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా అమెరికాలో జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తూ యూరప్‌లోనూ ప్రదర్శనలు జరిగాయి. బెర్లిన్, పారిస్, రోమ్, స్వీడన్‌లోని అమెరికా ఎంబసీల వెలుపల, ఇతర కీలక కూడళ్లలో ప్రజలు గుమికూడి అమెరికా పాలకుల ఫాసిజం, నియంతృత్వానికి వ్యతిరేకంగా నిరసలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాస్వామిక విలువలను పాటించడం లేదని నిరసనకారులు నినదించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న నిరసనలకు అక్కడి డెమోక్రటిక్ సెనేటర్ ఆడమ్ షిఫ్ సంఘీభావం ప్రకటించారు. సామాన్య ప్రజలు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక విలువలకు రక్షణగా నిలబడ్డారని ఆయన తెలిపారు. అట్లాంటాలో సివిక్ సెంటర్ వెను ఉన్న పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్న వందలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.