అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, విధానాలపై అమెరికన్లలో రోజురోజుకూ ఆగ్రహం పెరిగిపోతున్నది. దేశానికి రాజులు లేరని.. నిరంకుశత్వాన్ని సహించబోమని దేశ వ్యాప్తంగా శనివారం ప్రజలు ‘50501’ పేరిట భారీ నిరసన ప్రదర్శలు నిర్వహించారు. వలసదారులకు స్వాగతం పలుకుతామని నినదించారు. ట్రంప్ పాలనలో సొంత పౌరులే బాధితులుగా మారారని.. ఆయనను అభిశంసించాలని వారు డిమాండ్ చేశారు.
America | న్యూయార్క్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్సాఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించగా, తాజాగా శనివారం ‘50501’ పేరిట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ దిగిపో అంటూ అమెరికా పౌరులు నినదించారు. పౌర హక్కులకు, చట్ట నిబంధనలకు ట్రంప్ పాతరేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ‘అమెరికాలో రాజులు లేరు’, ఫ్యూడల్ యుగం ముగిసింది అన్న స్లోగన్లతో హోరెత్తిస్తూ న్యూయార్క్, వాషింగ్టన్‌తో పాటు దేశంలోని పలు నగరాలలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిరంకుశత్వాన్ని ఎదిరించండి, అమెరికాలో రాజులు లేరు అని నినాదాలు రాసిన ప్లకార్డులు చేతబట్టిన పౌరులు న్యూయార్క్‌లోని సిటీ మెయిన్ లైబ్రరీ బయట భారీ ప్రదర్శన జరిపారు.
సరైన పత్రాలు లేవంటూ వేలాదిమంది వలసవాదులను ట్రంప్ ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించడాన్ని, కొందరు విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని పౌరులు తీవ్రంగా నిరసించారు. భయం లేదు.. వలసవాదులకు దేశం స్వాగతం చెబుతుంది అంటూ నినాదాలు చేస్తూ వారికి మద్దతు ప్రకటించారు. అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కులను ట్రంప్ ప్రభుత్వం కాలరాయడం పట్ల వాషింగ్టన్లో నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు ట్రంప్ హయాంలో అమెరికాలోనూ అదే జరుగుతున్నదని ఒక నిరసనకారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక శాన్ఫ్రాన్సిస్కోలో అయితే ట్రంప్‌ను అభిశంసించండి, తొలగించండి అంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ బాధను వ్యక్తం చేసేందుకు గుర్తుగా కొన్ని చోట్ల అమెరికా జెండాను తలకిందులుగా ఎగురవేశారు. 50 నిరసనలు, 50 రాష్ర్టాలు, ఒక ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ‘50501’ పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించింది.
ట్రంప్ విధానాల వల్ల సొంత దేశ ప్రజలే బాధితులుగా మారుతున్నారని, దీనిని ప్రతిఘటించాలని 80 ఏండ్ల వృద్ధుడొకరు పేర్కొన్నారు. ‘అమెరికాలో స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన కీలక సమయం.కొన్నిసార్లు స్వతంత్రం కోసం పోరాడాలని కూడా వారికి చెబుతా’ అని మరో వ్యక్తి తెలిపారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు, సంస్థల మూసివేతతో పాటు పలువురికి దేశ బహిష్కరణ శిక్ష విధించడాన్ని ఆందోళనకారులు ప్రశ్నించారు.
డౌన్‌టౌన్ పోర్ట్‌లాండ్‌లో వేలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించగా, ఒరెగాన్, అలస్కా, శాన్ఫ్రాన్సిస్కో, పసిఫిక్ సముద్రం వద్ద శాండీ బీచ్ పొడవునా నిరసనలు తెలిపారు. అలాగే ప్రభుత్వాన్ని దిగజార్చడంలో కీలక పాత్ర వహించిన ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా టెస్లా కంపెనీ కారు డీలర్ షిప్‌ల ఎదుట నిరసనలకు దిగారు. మరికొన్ని చోట్ల షెల్టర్లలో స్వచ్ఛంద సేవ వంటి కమ్యూనిటీ సేవా ఆధారిత కార్యక్రమాలు నిర్వహించారు.