వాషింగ్టన్ : వీసా ఇంటర్వ్యూ మినహాయింపులను చాలా వరకు అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. 14 ఏళ్ల లోపు బాలలు, 79 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా నేటి (సెప్టెంబరు 2) నుంచి వ్యక్తిగతంగా కాన్సులర్ ఇంటర్వ్యూలకు హాజరుకావలసిందే. దీంతో వీసా ఇంటర్వ్యూ వెయివర్ (డ్రాప్‌బాక్స్)కు అర్హుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. వీసాల జారీ విధానాల్లో మార్పులను అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఇకపై డిప్లమేటిక్ లేదా అఫిషియల్ వీసాలు (ఏ-1, ఏ-2, సీ-3, అటెండెంట్లు, వ్యక్తిగత సిబ్బంది మినహా) ఉన్నవారు వ్యక్తిగతంగా కాన్సులర్ ఇంటర్వ్యూకు హాజరుకానక్కర్లేదు. బీ1, బీ2 లేదా బీ1/బీ2 వీసాను గడువు ముగిసిన 12 నెలల్లోగా రెన్యువల్ చేయించుకునే దరఖాస్తుదారులు, అంతకుముందు తమకు వీసా జారీ అయిన తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల వయసుగల వారు అయితే, వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు పొందవచ్చు.
హెచ్-1బీ వర్కర్స్, ఎఫ్-1 స్టూడెంట్స్ కూడా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరుకాక తప్పదు. స్వల్ప ఇంటర్వ్యూ మినహాయింపును పొందడానికైనా కఠినమైన షరతులను నెరవేర్చవలసి ఉంటుంది. సాంకేతికంగా మినహాయింపునకు అర్హతగల వారిని కూడా వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలిచే అధికారం కాన్సులర్ అధికారులకు ఉంటుందని స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పింది. మరోవైపు, వీసా రుసుములు కూడా పెరిగిపోతున్నాయి. బీ1/బీ2 బిజినెస్, టూరిస్ట్ వీసాలు, ఎఫ్-1, ఎఫ్-2 స్టూడెంట్ వీసాలు, ట్రాన్సిట్ వీసాల రుసుములు వచ్చే నెల నుంచి 148 శాతం కన్నా ఎక్కువగా పెరగబోతున్నాయి.