Pennies | లాస్ఏంజెల్స్ : పెద్దమొత్తంలో నిధి దొరికిందని ఆనందపడిన ఓ అమెరికన్ కుటుంబం, 1900 నాటి రాగి నాణేల్ని ఎలా నగదు చేసుకోవాలా? అని దిగాలు చెందుతున్నది. లాస్ఏంజెల్స్లో రియల్టర్ జాన్ రీస్, అతని భార్య ఎలిజబెత్‌కు వారసత్వంగా లభించిన ఇంటిలో శుభ్రం చేస్తుండగా, వారికి బేస్మెంట్లోని ఒక నేలమాళిగలో పాత పేపర్ రోల్స్‌తో పాటు డబ్బాలు, పెట్టెలు, బస్తాలు పెద్ద సంఖ్యలో కన్పించాయి.
వాటన్నింటినీ తెరచి చూడగా కుప్పలు కుప్పలుగా పెన్నీ రాగి నాణేలు బయటపడ్డాయి. ఇంచుమించు పది లక్షల పెన్నీల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. దీంతో వాటిని మార్చడానికి ఆ దంపతులు ప్రయత్నాలు ప్రారంభించి రకరకాలు ఆలోచనలు చేశారు. కొన్ని బ్యాంకులు తొలుత వాటిని తీసుకోవడానికి ముందుకు వచ్చినా అంత పెద్దమొత్తంలో ఉన్న పెన్నీలను దాచిఉంచే పరిస్థితి లేక వెనుకంజ వేశాయి.