United cut jobs | ఈ నెల 24 న అమెరికా అంతటా ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ను ఘనంగా జరుపుకున్నారు. తమకు అండగా నిలిచి ఆదుకున్న వారిని గుర్తుచేసుకుంటూ ప్రతిగా వారికి బహుమతులు ఇవ్వడం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ నాడు ఆనవాయితీగా వస్తున్నది. అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగు రోజుల ముందుగానే ‘థ్యాంక్స్ గివింగ్ డే’ విషెస్ చెప్పింది. దాదాపు 2,700 మందిని ఉద్యోగాల నుంచి ఊడబెరికి.. మరుసటి రోజు నుంచి ఇటువైపు రావొద్దని సూచించింది. నవంబర్ 21 అమెరికా యునైటెడ్ ఫర్నీచర్ ఉద్యోగులకు కాలరాత్రిగా మిగిలిపోయింది. మళ్లీ ఆఫీసుకు రావడానికి వీలు లేకుండా మీమీ
వస్తువులను వెంట తీసుకెళ్లాలని సంస్థ సూచించడంతో ఉద్యోగులు నిర్ఘాంతపోయారు.
అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఫర్నీచర్ తయారీ కంపెనీ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (యూఎఫ్ఐ) దాదాపు 2,700 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మరుసటి రోజు నుంచి పనుల్లోకి రావొద్దని సూచిస్తూ ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపింది. బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫాలు, రిక్లైనర్లను తయారు చేయడంలో యూఎఫ్ఐ ప్రసిద్ధి చెందింది. ‘వ్యాపారంలో అనివార్య పరిస్థితులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ బోర్డు డైరెక్టర్ల ఆదేశాల మేరకు ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నందుకు విచారిస్తున్నాం ..’ అని మెసేజ్‌లో సంస్థ పేర్కొన్నది. ఈ కారణంగానే కంపెనీ తన ఉద్యోగులందరినీ తొలగించే కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింనది.. మీమ్మల్ని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నారని, సంస్థ అందించే అన్ని సౌకర్యాలు రద్దయ్యాయని మరో ఈ మెయిల్లో తెలిపిందని న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది.
హఠాత్తుగా ఎందుకు తొలగిస్తున్నరనే దానిపై ఉద్యోగులకు సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రెండు దశాబ్దాల నాటి ఈ కంపెనీ తన పనిని అకస్మాత్తుగా నిలిపివేయడం అమెరికాలో ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కొన్ని రోజుల క్రితమే కంపెనీ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) ను తొలగించిందని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో తెలిపింది. కాగా, కంపెనీ నిర్ణయంపై పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.