న్యూఢిల్లీ, జనవరి 9: వెనెజువెలా నుంచి చమురు ట్యాంకర్ల రాకపోకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికా దళాలు శుక్రవారం కరేబియన్ సముద్రంలో మరో చమురు ట్యాంకర్ని స్వాధీనం చేసుకున్నాయి. గడచిన మూడు రోజుల్లో అమెరికా స్వాధీనం చేసుకున్న మూడో చమురు ట్యాంకర్ ఇది. అమెరికా నౌకాదళ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా సదరన్ కమాండ్ తెలిపింది. ఓలినా అనే చమురు ట్యాంకర్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన కమాండ్.. నేరస్థులు తప్పించుకునే అవకాశమే లేదని స్పష్టం చేసింది.
కరేబియన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఓలినా చమురు ట్యాంకర్ని కోస్ట్‌గార్డులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిష్టీ నోయెమ్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆమె షేర్ చేస్తూ వెనెజువెలా నుంచి అనధికారికంగా చమురును తరలిస్తుండగా అమెరికా అధికారుల కంటపడకుండా తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ చమురు ట్యాంకర్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్ చట్టానికి లోబడి ఉండే విధంగా రక్షణ, విదేశాంగ, న్యాయ శాఖల సమన్వయంతో నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ఆంక్షలు విధించిన చమురు ట్యాంకర్ల స్వాధీనం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.