America on China | కరోనా నేపథ్యంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కొవిడ్‌కు సంబంధించి సమాచారాన్ని మిగతా దేశాలతో పంచుకోవడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలను పెంచింది. జిన్‌పింగ్ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ నియంత్రణలో లేదని అమెరికా ఆరోపిస్తున్నది. బీజింగ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులందరిపై కఠిన ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్, జపాన్, మలేషియా ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయని అమెరికా అధికారులు తెలిపారు. జనవరి 8 నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులను నిర్బంధించాల్సిన అవసరాన్ని చైనా రద్దు చేసింది. దీంతో చైనాలో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగిపోయిందని అమెరికా ఆరోపిస్తున్నది.
ఇలా ఉండగా, కొవిడ్ డాటాను నెలకోసారి మాత్రమే విడుదల చేస్తున్నట్లు చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ మేనేజిమెంట్ (సీడీసీఎం) స్పష్టం చేసింది. కొవిడ్ ప్రస్తుతం బీ క్యాటగిరి వ్యాధి జాబితాలో చేర్చినందున రోజువారీ డాటా ఇవ్వాల్సిన అవసరం లేదని సీడీసీఎం అధికారులు చెప్పారు. కాగా, చైనాలోని చాలా దవాఖానల్లో వైద్య సిబ్బంది కొరత ఉన్నదని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. కొన్ని హాస్పిటళ్లలో గతంలో ఒక వార్డులో 15 మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు వైద్య సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారని కథనం రాసింది.