వాషింగ్టన్: సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) విరుచుకుపడుతున్నది. ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్‌కు చెందిన ముష్కరుడు పాల్పడిన దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు. డిసెంబర్ 13న పాల్మైరాలో అమెరికా దళాలపై జరిగిన దాడికి ప్రతిగా ఈ ఆపరేషన్‌ను చేపట్టామని వెల్లడించింది.
సిరియాలోని ఐసిస్ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్ ప్రారంభించాయని పీట్ హెగ్సెత్ తెలిపారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందన్నారు.

