Israel War | లెబనాన్‌పై జరిపిన దాడిలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్‌ను వినియోగించినట్లుగా వచ్చిన వార్తలపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ పేర్కొన్నారు. అమెరికా ఇతర దేశాల సైన్యానికి వైట్ ఫాస్ఫరస్ అందజేస్తుందని.. దాన్ని సక్రమంగా వినియోగిస్తూ యుద్ధ నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అక్టోబర్‌లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైట్ ఫాస్ఫరస్‌ను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ వార్తలపై తాము ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జాన్ కిర్బీ పేర్కొన్నారు. కథనాల ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తొమ్మిది మంది పౌరులు గాయపడ్డారని, యుద్ధ నేరంగా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని లెబనాన్‌లోని డెహ్రా ప్రాంతంలో ఆధారాలు దొరికాయి. ఇందులో వైట్ ఫాస్ఫరస్‌ను ఉపయోగించినట్లు తేలింది. ఈ వైట్ ఫార్ఫరస్ ఓ రసాయన పదార్థం కాగా.. దీనికి మండే లక్షణాలుంటాయి. వైట్ ఫార్ఫరస్ ఆక్సిజన్‌తో కలిసినప్పుడు కాలిపోతుంది.
సాధారణంగా దీన్ని ఫిరంగి గుండ్లు, బాంబులు, రాకెట్లలో ఉపయోగిస్తుంటారు. దీన్ని శత్రవులను గందరగోళానికి గురి చేసేందుకు వాడుతుంటారు. ప్రకాశవంతమైన వెలుగు, దట్టంటగా పొగ వచ్చేందుకు సైతం వినియోగిస్తుంటారు. అయితే, దీన్ని మనుషులపై నేరుగా పెద్ద ఎత్తున ప్రయోగిస్తే తీవ్రమైన మంటను కలిగించడంతో పాటు ఆ మంట ఎముకలకు సైతం చేరుతుంది. గాయాలు మానేందుకు చాలా సమయంపట్టడంతో పాటు దాంతో కలిగే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గాయాలు ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది.
శ్వాస తీసుకోవడం ఇబ్బందితో పాటు శరీరంలోని అనేక భాగాలు పనిచేయడం ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ భాస్వరం ప్రభావం జీవితాంతం ప్రభావం చూపుతుంది. వైట్ ఫార్ఫరస్తో ఏర్పడే మంటలు ఇండ్లు, భవనాలను సైతం నాశనం చేస్తాయి. ఈ మంటల్లో మనుషులు చిక్కుకుపోతే ఎముకలను సైతం బూడిద చేసే సామర్థ్యం ఈ ఫార్ఫరస్కు ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆరోపణలను ఖండించింది. వైట్ ఫారస్ఫరస్ను పొగ వచ్చేలా చేసేందుకు మాత్రమే ఉపయోగించినట్లు స్పష్టం చేసింది.