వాషింగ్టన్, ఏప్రిల్ 22 : ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్న హెచ్1బీ ఉద్యోగుల పట్ల ట్రంప్ సర్కార్ మరింత కఠిన వైఖరి అమలుజేస్తున్నది. ఉద్యోగుల ఇంటి చిరునామాలు, వారి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాల్సిందిగా అక్కడ పనిచేస్తున్న విదేశీయులు, అటార్నీలకు (యాజమాన్యాల తరఫు న్యాయవాదులు) ‘రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్’లు జారీ అవుతున్నాయి. యూఎస్ పౌరసత్వం, వలస సేవల విభాగం(యుఎస్సీఐఎస్) ఇంతకు ముందు ఈ వివరాలు అడగలేదు, ఇప్పుడు కొత్తగా ఇదంతా ఏంటి? అంటూ అటార్నీలు, విదేశీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘బయోమెట్రిక్, ఇంటి చిరునామాలు కోరటం.. అసాధారణ విషయం. ప్రతికూల సమాచారం ఎందుకు అన్నది యాజమాన్యాలు, అటార్నీలకు తెలపటం లేదు’ అని ఫోర్బ్స్ వార్తా కథనం పేర్కొన్నది.