Russia-Ukraine War | రియాద్, ఫిబ్రవరి 17: మూడేండ్లుగా మారణహోమాన్ని సృష్టిస్తున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం రియాద్‌లో అమెరికా, రష్యా ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నాయి. అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యురి ఉషాకోవ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధవిరమణ ఒప్పందం, అమెరికా – రష్యా మధ్య సంబంధాల పునరుద్ధరణపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. యుద్ధవిరమణ ఒప్పందం కోసం తదుపరి కార్యాచరణ సైతం ఖరారయ్యే అవకాశం ఉంది. త్వరలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ మధ్య తుది చర్చలు జరగనున్నాయి. వీరి భేటీపై కూడా మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. అమెరికా – రష్యా ప్రతినిధుల చర్చల్లో ఉక్రెయిన్ భాగమవుతుందని డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. అయితే, తమ దేశానికి ఆహ్వానం రాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ప్రకటించారు. తమ దేశం పాత్ర లేకుండా జరిగే చర్చలు ఫలితాలను ఇవ్వవని, ఈ చర్చల ఫలితాన్ని ఉక్రెయిన్ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.