కాలిఫోర్నియా, డిసెంబర్ 2 : యాపిల్ కంపెనీ కృత్రిమ మేధ(ఏఐ) విభాగానికి నూతన వైస్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. గత 16 ఏండ్లుగా గూగుల్‌లో పనిచేస్తున్న ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది జూలైలో మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. జాన్ గియాండ్రే స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐ రంగంలో అపార నైపుణ్యాన్ని కలిగిన అమర్‌ను యాపిల్‌కు తీసుకురావడానికి తాము సంతోషిస్తున్నామని సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు.
యాపిల్ ఫౌండేషన్ మాడల్స్, మెషిన్ లెర్నింగ్ పరిశోధన, ఏఐ భద్రత, మూల్యాంకనం సహా యాపిల్ చేపట్టే ఏఐ ప్రాజెక్టులకు అమర్ సుబ్రమణ్య నాయకత్వం వహించనున్నారు. అమర్ 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు. 2009లో గూగుల్‌లో స్టాఫ్ రిసెర్చ్ సైంటిస్టుగా చేరి, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు చేరుకున్నారు. సంస్థతో కలిసి సంవత్సరాలుగా పనిచేస్తున్న లోపలి వ్యక్తుల్ని నాయకులుగా యాపిల్ తయారుచేసేది. ఈసారి దీనికి మినహాయింపుగా అమర్ సుబ్రమణ్యను యాపిల్ బయట నుంచి తీసుకొచ్చింది.