న్యూయార్క్: ఈ-సిగరెట్లతో గుండెలయలో మార్పులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లూయీవిల్లి శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన అధ్యయనాల్లో ఈ సంగతి వెల్లడైనట్టు పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన అలెక్స్ కారల్ తెలిపారు. జంతువుల గుండె కొట్టుకునే తీరులో ఈ-సిగరెట్ల వల్ల మార్పులు వచ్చినట్టు ఆయన వివరించారు.
ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన అరుణి భట్నాగర్ కూడా ఉండటం విశేషం. గుండెలయలో మార్పుల పర్యవసానంగా గుండెజబ్బులు, గుండెపోటు రావచ్చని కారల్ హెచ్చరించారు. ఈ-సిగరెట్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.