(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. 2022లో క్యాన్సర్ సంబంధిత కారణాలతో 97 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అదే ఏడాది 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూశాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని తుదముట్టించాలని ప్రపంచ దేశాల్లో వైద్య నిపుణులు తమ ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే, క్యాన్సర్ ఆట కట్టించడానికి వైద్యులకు పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నది. ఈ క్రమంలోనే క్యాన్సర్‌ను నయం చేయడానికి కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న లండన్‌కు చెందిన ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ అనే సంస్థ ఆల్ఫాఫోల్డ్ 3 అనే ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసింది. క్యాన్సర్‌ను నయం చేసే ఆంకాలజీ డ్రగ్‌ను ఈ ఏఐ టూల్ అభివృద్ధి చేసింది.
క్యాన్సర్ సోకిన వ్యక్తుల కణాలు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నాయి? వాళ్ల ప్రొటీన్ స్ట్రక్చర్ ఏమిటీ? తదితర అంశాలను బట్టే క్యాన్సర్ ఔషధాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సేకరించాలంటే వైద్యులకు చాలా సమయం పడుతుంది. అయితే, ఆల్ఫాఫోల్డ్ 3 ఏఐ టూల్ తనకు కమాండ్ చేసిన ప్రత్యేక అల్గారిథమ్‌తో ఈ వివరాలను తక్కువ సమయంలోనే సేకరించి రికార్డు చేసింది. అంతేకాదు, శరీరంలోని క్యాన్సర్ కణాల వృద్ధిని నిలువరించడం లేదా చంపాలంటే.. ప్రొటీన్‌కు శక్తినిచ్చే, రోగనిరోధక శక్తిని మెరుగుపర్చే ఏ ఫార్ములా ఔషధం అవసరమో కూడా తక్కువ సమయంలోనే కచ్చితత్వంతో గుర్తించింది. ఈ క్రమంలోనే క్యాన్సర్ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ డ్రగ్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది.
ఆల్ఫాఫోల్డ్ 3 ఏఐ టూల్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్ సత్ఫలితాలను ఇస్తే, వైద్య చరిత్రలో ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ఓ గేమ్‌ఛేంజర్‌గా భావించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాగా పలు రకాల వ్యాధులను నయం చేయడానికి వైద్య శాస్త్రంలో ఏఐ వాడకం అంతకంతకూ పెరుగుతున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏఐ టూల్స్ అభివృద్ధి చేసిన ఔషధాలు.. 3 వేల వరకూ ఉంటాయని గ్లోబల్ డాటా స్టాటిస్టిక్స్ ఓ నివేదికలో వెల్లడించింది.