జురిచ్, మే 15: మద్యం తాగిన తెల్లారి హ్యాంగోవర్‌తో తలపట్టుకొని కూర్చుంటారు మద్యం ప్రియులు. మద్యపానం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా కాపాడే కొత్త ప్రొటీన్ జెల్‌ను స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జురిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారుచేశారు. ‘నేచర్ నానోటెక్నాలజీ’ అనే జర్నల్‌లో వివరాలు ప్రచురితమయ్యాయి. పాల ప్రొటీన్లు, అతి సూక్ష్మ బంగారు పదార్థాలతో తయారుచేసే ఈ జెల్ హ్యాంగోవర్ కాకుండా చేస్తుందట. సాధారణంగా మద్యాన్ని కాలేయం విచ్ఛిన్నం చేస్తుంది.
ఈ ప్రక్రియలో ఎసిటాల్డిహైడ్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. తలనొప్పి, నోరు పొడిబారడం, లో బీపీ, వికారం, గుండె వేగం పెరగడం, చర్మ ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వంటి హ్యాంగోవర్ లక్షణాలకు ఇదే ప్రధాన కారణం. ఈ ప్రొటీన్ జెల్ మాత్రం కాలేయంలో కాకుండా జీర్ణశయంలో మద్యం విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది. తద్వారా ఎసిటాల్డిహైడ్ ఉత్పత్తి కాదు. హ్యాంగోవర్ లక్షణాలు తగ్గుతాయి. కాలేయానికి కూడా నష్టం తగ్గుతుందట. ముందుగా ఈ జెల్‌ను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలకు మద్యంతో పాటు ఈ జెల్ కూడా ఇచ్చినప్పుడు కాలేయం పాడయ్యే ముప్పు తగ్గినట్టు గుర్తించారు.