సిడ్నీ, జనవరి 5: అలసట వచ్చిందని ఆగిపోలేదు.. ఆకలేస్తున్నదని కిందకు దిగలేదు.. వెయ్యి.. రెండు వేలు కాదు ఏకంగా 13 వేల కిలోమీటర్లు 11 రోజుల పాటు ఒక వలస పక్షి ఆకాశంలో ప్రయాణం సాగించిందంటే అది నిజంగా అబ్బురమే. పొడవాటి తోకతో ఉండే గాట్‌విట్ (నేల నెమలి) పక్షి ఈ ఫీట్‌ను సాధించి పాత గిన్నిస్ రికార్డును తిరగరాసింది. అలస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు ఈ పక్షి 11 రోజుల పాటు అలుపెరుగని ప్రయాణం సాగించింది. కనీసం ఆహారం, నీటి కోసం కూడా దిగకుండా 8,435 మైళ్లు (13,560 కిలోమీటర్లు) ప్రయాణించినట్టు గిన్నిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు. వీపు దిగువ భాగాన ఈ పక్షికి అమర్చిన శాటిలైట్ ట్యాగ్‌తో దాని కదలికలు రికార్డు చేశారు. అక్టోబర్ 13, 2022న ప్రయాణం ప్రారంభించిన ఈ పక్షి 11 రోజుల ఒక గంట పాటు ప్రయాణాన్ని ఆపకుండా సాగించింది. ఇది గతంలో మరో పక్షి సాధించిన రికార్డు దూరం కంటే 217 మైళ్లు ఎక్కువ.