Burkina Faso | అంతర్యుద్ధంతో సతమతమవుతున్న పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో (Burkina Faso)లో మళ్లీ హింస చెలరేగింది. దేశ ఉత్తర ప్రాంతంలో అల్‌ఖైదాకు చెందిన జిహాదీలు (Al Qaeda linked group) ఊచకోతకు పాల్పడ్డారు. జిహాదీ గ్రూప్ (jihadi group) జరిపిన దాడిలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.
ఉత్తర బుర్కినా ఫాసోలోని కీలకమైన జిబో పట్టణంతో పాటు అక్కడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న జిహాదీలు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఏకకాలంలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. డజిబో (Djibo) ప్రాంతంలో ప్రధానంగా ఆ దాడులు జరిగాయి. సైనిక శిబిరాలు, కీలక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. ఈ దాడులు తమ పనే అని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నస్ర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) అనే జిహాదీ గ్రూప్ప్రకటించుకుంది.
కాగా, 23 మిలియన్ల జనాభా కలిగిన బుర్కినా ఫాసోలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేదు. అక్కడ సైనిక జుంటా పాలన కొనసాగుతోంది. సాహెల్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర అనిశ్చితి కారణంగా నిత్యం రగులుతోంది. 2022లో జరిగిన తిరుగుబాట్లతో ఆ దేశంలో సగభాగం కంటే ఎక్కువ ఇతర గ్రూపుల అధీనంలోకి వెళ్లిపోయింది. నిత్యం ఇక్కడ అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తూనే ఉన్నారు. ఊచకోతకు పాల్పడుతూ వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నారు.
Also Read..
Floods | వరద బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
China | పాక్‌కు మేం ఆయుధాలు పంపుతలేం.. ఇంటర్నెట్లో ప్రచారాన్ని కొట్టిపారేసిన చైనా