లండన్, డిసెంబర్ 17: వాయు కాలుష్యం బారిన పడకుండా చూసుకొనేందుకు చాలా మంది ఎయిర్ ప్యూరిఫయర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో థర్మల్ లేదా ఫొటోకెటలిటిక్ ఆక్సిడేషన్, అబ్సార్ప్షన్, ఫిల్టరేషన్, యూవీ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్, అయాన్ జనరేషన్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేషన్ తదితర పలు రకాల టెక్నాలజీలతో కూడిన ఎయిర్ ప్యూరిఫయర్లు లభ్యమవుతున్నాయి. ఇవి గాలిలోని కాలుష్యాన్ని నిర్మూలించేవే అయినప్పటికీ ఆరోగ్యానికి మాత్రం హానికరమేనని బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘సేజ్’ (సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్) తన తాజా నివేదికలో తేల్చింది. ఏ టెక్నాలజీతో కూడా కూడిన ఎయిర్ ప్యూరిఫయర్ అయినా ఇంటిలోని వాయు కాలుష్య కారకాలను పూర్తిగా నిర్మూలించలేదని, పైపెచ్చు పలు రకాల ప్యూరిఫయర్లు అవాంఛిత రసాయన కాలుష్య కారకాలను సృష్టిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొన్నది. గాలిలోని కాలుష్య రేణువుల (పర్టిక్యులేట్ మ్యాటర్)ను తొలగించినా, ఓజోన్ను, నైట్రోజన్ ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయని స్పష్టం చేసింది.