Loud Quitting| న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనంతరం ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉద్యోగుల అభిరుచులూ మారాయి. పని సంస్కృతిలో కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేట్ రిజిగ్నేషన్, మూన్‌లైటింగ్, రేజ్ అప్లయింగ్, క్వైట్ క్విటింగ్ వంటి పోకడలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా మరో కొత్త ట్రెండ్ చర్చనీయాంశంగా మారింది. అదే లౌడ్ క్విటింగ్. కార్పొరేట్ వర్గాల్లో ప్రస్తుతం దీనిపై విస్తృత చర్చ జరుగుతున్నది.
లౌడ్ క్విటింగ్ అంటే ఏమిటి?
అదనపు భారాన్ని భుజానికేసుకోకుండా, తన పని ఎంత వరకో అంతకే పరిమితం కావడాన్ని క్వైట్ క్విటింగ్ అంటారన్న విషయం తెలిసిందే. దీనికి పూర్తిగా భిన్నమైనదే లౌడ్క్విటింగ్. ఉద్యోగులు పూర్తిగా తమ పనిని విస్మరించడం, దానిని బహిరంగంగా వ్యక్తపరచడానికి కూడా వెనుకాడకపోవడాన్ని లౌడ్క్విటింగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఓ ఉద్యోగి లౌడ్క్విటింగ్ అనుసరిస్తున్నారని గాలప్ సంస్థ రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. నేరుగా సంస్థపై ప్రభావం చూపేలా, సంస్థ లక్ష్యాలను దెబ్బతీసేలా, యాజమాన్యాన్ని ధిక్కరించేలా ఈ ఉద్యోగుల చర్యలు ఉంటాయని నివేదిక తెలిపింది. ఉద్యోగానికి రాజీనామా చేసే ముందు వీరు తమ సంస్థపైన, బాస్‌పైనా నెగెటివ్ కామెంట్లు చేయడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం కలిగిస్తారని పేర్కొన్నది.
ఎందుకు ఈ ధోరణి?
తాను చేస్తున్న పని పట్ల ఉద్యోగి అసంతృప్తిగా ఉండటం, పై అధికారితో పొగసకపోవడం, క్రమంగా ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య దూరం పెరగడం వంటివి ఈ ధోరణికి కారణమని గాలప్ నివేదిక తెలిపింది. నచ్చని ఉద్యోగం.. నిరుద్యోగం కంటే దారుణమైనదని పేర్కొన్నది.
ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఇతర ట్రెండ్స్..
గ్రేట్ రిజిగ్నేషన్
ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలు ప్రకటించినా.. ఉద్యోగులు తమ కొలువులు వదిలి కొత్త దారులు వెతుక్కోవడాన్ని గ్రేట్ రిజిగ్నేషన్గా పిలుస్తున్నారు.
మూన్‌లైటింగ్
ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థకు తెలియకుండా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం. కరోనా తర్వాత టెక్ సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో ఈ ధోరణి పెరిగింది.
రేజ్ అప్లయింగ్
ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. వేగంగా కొత్త ఉద్యోగం పొందడానికి అనేక సంస్థలకు దరఖాస్తు చేసుకోవడాన్ని రేజ్ అప్లయింగ్ అంటారు.