టోక్యో: విమాన ప్రయాణికులు కాళరాత్రిని ఎదుర్కొన్నారు. రాత్రంతా విమానంలో ఉండి ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆ విమానం టేకాఫ్ అయిన ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుంది. జపాన్ రాజధాని టోక్యోలో ఈ సంఘటన జరిగింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఎల్ 331 విమానం టోక్యోలోని హనేడా విమానాశ్రయం నుంచి ఫుకుయోకాకు ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు బయలు దేరాల్సి ఉంది. అయితే విమానం మార్పు వల్ల 90 నిమిషాలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు టేకాఫ్ అయ్యింది. 355 మంది ప్రయాణికులున్న ఆ విమానం సుమారు రెండు గంటలు ప్రయాణించి ఫుకుయోకా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.
కాగా, రాత్రి పది గంటలు దాటితే ఫుకుయోకా విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కు అనుమతించరు. ఆదివారం వాతావరణం అనుకూలించకపోవడంతో హనేడా విమానాశ్రయం నుంచి ఫుకుయోకా నగరానికి చాలా విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ముందు వచ్చిన విమానాల ల్యాండింగ్‌కు ఫుకుయోకా ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించారు. అయితే సమయం మించిపోవడం, ఎయిర్‌పోర్ట్‌లో తగినంత స్థలం లేకపోవడం వల్ల జేఎల్ 331 విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో పైలట్లు ఆ విమానాన్ని ఒసాకా సమీపంలోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఆదివారం రాత్రి 10:59 గంటలకు అక్కడ ల్యాండ్ అయ్యింది.
మరోవైపు విమానంలోని 355 మంది ప్రయాణికులను తరలించేందుకు బస్సులు, అంత మందికి బస కల్పించేందుకు హోటల్ గదులు అందుబాటులో లేవు. దీంతో ఆ విమానం అక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది. ఆరంభం నుంచి మొత్తం ఏడు గంటలు ప్రయాణించిన తర్వాత సోమవారం తెల్లవారుజామున తిరిగి టోక్యోలోని హనేడా విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో అందులో ప్రయాణించిన 355 మంది ప్రయణికులు రాత్రి అంతా జాగారం చేయడంతోపాటు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.