Afghanistan | ఇస్లామాబాద్, జనవరి 27: తాలిబన్ల పాలనలో అఫ్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ ప్రజానీకం రోజురోజుకూ దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తున్నది. అంతర్జాతీయంగా అభివృద్ధి, భద్రతా పరమైన అవసరాలకు సహకారం కరువైంది. అప్ఘనిస్థాన్ మానవీయ ప్రణాళిక అమలుకు కూడా నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి(ఐరాస) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2024లో ప్రణాళిక ద్వారా కేవలం 50 శాతం నిధులు మాత్రమే అందాయని ఐరాస పేర్కొంది. విదేశాల నిధులు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఎన్జీవోల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు వీలు కలుగుతుంది. గతంలో సాయం చేసిన దాతలు కూడా ఈ సారి సాయంలో కోతలు విధించుకున్నారు.
ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్పీ)లో భాగమైన మానవీయ సాయం అందకపోవడంతో సుమారు 1.5 కోట్ల ఆకలితో అలమటిస్తున్నారని, ప్రజానీకం బ్రెడ్, టీతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో 1, 2 పూటలు తింటున్న ప్రజల సంఖ్య 60 లక్షలకు పైగానే ఉంటున్నదని పేర్కొంది.