తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులు సమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన ఆఫ్గనిస్తాన్ ఈ బడ్జెట్ చాలా కీలకం. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలూ కొన్ని నెలల నుంచి అందడం లేదు. ఉద్యోగులు వేతనాల కోసం రోడ్డెక్కి ధర్నాలూ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అఫ్ఘాని దారుణంగా పతనం అయింది. తాలిబాన్లు రాక పూర్వం ఒక అమెరికన్ డాలర్ విలువ 80 అఫ్ఘానీలు ఉండగా.. ఆ విలువ 100 నుంచి 130 అఫ్ఘానీల మధ్యకు పతనమైంది.
ఆఫ్ఘనిస్తాన్‌కు విదేశీ ఆర్థిక సహాయం అందకపోవడమే ఈ పరిస్థితులకు కారణం. ఐఎంఎఫ్ సహా పాశ్చాత్య, ఇతర దేశాలు విదేశీ సాయాన్ని నిలిపేశాయి. అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో విదేశీ సహాయం లేకుండానే తాలిబాన్లు బడ్జెట్ రూపొందిస్తున్నారు.