కాలిఫోర్నియా: ఆస్కార్ అవార్డు విజేత జీన్ హాక్‌మాన్, ఆయన భార్య బెట్సీ అరాక్వా.. లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు మరణించిన వారం రోజుల తర్వాత వాళ్లను గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు .. ఆ మరణాలు సహజమే అని తేల్చారు. అయితే జీన్ హాక్‌మాన్ భార్య బెట్సీ .. హంటావైరస్(Hantavirus) పల్మోనరీ సిండ్రోమ్ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. న్యూ మెక్సికో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హీతర్ జారెల్.. ఆస్కార్ నటుడు హాక్‌మాన్ మృతి గురించి ప్రకటన చేశాడు. గుండెపోటుతో జీన్ హాక్‌మాన్ మృతిచెందాడని, అయితే అతనికి అల్జీమర్ వ్యాధి కూడా ఉన్నట్లు తేల్చారు. హాక్‌మాన్ భార్య బెట్సీ మాత్రం హంటావైరస్ పల్మోనరీ సిండ్రోమ్‌తో మృతిచెందినట్లు డాక్టర్ జారెల్ వెల్లడించారు.
ఇంతకీ హంటావైరస్ ఏంటో తెలుసుకుందాం ..
హంటావైరస్‌తో తీవ్ర శ్వాసకోస వ్యాధులు వస్తాయి. జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది. కిడ్నీ, మూత్రాశయ వ్యాధులు కూడా వస్తాయి. ఎలుకల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వాటి మూత్రం, లాలాజలం, మలం ద్వారా ఈ వైరస్ ప్రబలుతుంది. అమెరికా సీడీసీ ప్రకారం.. వ్యక్తి నుంచి వ్యక్తికి ఈ వైరస్ ట్రాన్స్మిట్ కాదు. ఎక్కువ శాతం ఎలుకల వల్లే వైరస్ వ్యాప్తి అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎలుక కొరికితే కూడా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
హంటావైరస్ పల్మోనరీ సిండ్రోమ్.. అరుదైన వైరల్ వ్యాధి. ఈ వైరస్‌తో గుండె, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు ప్రభావానికి గురవుతాయి. వైరస్ వేగంగా విస్తరిస్తుందని, ఇది ప్రాణాంతకంగా మారుతుందని క్లీవ్‌లాండ్ క్లినిక్ తన రిపోర్టులో తెలిపింది. ఎలుకల మలం లేదా లాలాజాన్ని నేరుగా తాకినప్పుడు వైరస్ ప్రభలే ఛాన్సు ఉన్నది. తీవ్రమైన లక్షణాలు ఉన్న ఈ వ్యాధి కేసులు అమెరికాలో తక్కువే. 1993 నుంచి 2022 వరకు అమెరికాలో మొత్తం 864 కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో న్యూమెక్సికోలోనే 122 కేసులు, కొలరాడోలో 119 కేసులు నమోదు అయ్యాయి.
తొలి దశలో హంటావైరస్ వల్ల ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, వణుకుడు, వొళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, గొంతు ఎండిపోవడం, బ్రీతింగ్ సమస్యలు వస్తాయి. లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. 10 మందికి సోకితే, దాంట్లో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. వైరస్ వల్ల బ్రీతింగ్ సమస్యలు వచ్చి, దాంతో గుండె లేదా శ్వాసకోస వ్యవస్థ స్తంభించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ జారెల్ తెలిపారు.
రక్త పరీక్ష ద్వారా వ్యాధిని సలువుగా గుర్తించవచ్చు.