ఒట్టావా: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిబంధనల్ని కఠినతరం చేస్తున్న కెనడా, తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. క్యాంపస్ బయట అంతర్జాతీయ విద్యార్థుల పనిగంటల్ని వారానికి 24కు పరిమితం చేయాలన్న ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ వలసలు, శరణార్థులు, పౌరసత్వం శాఖ మంత్రి మార్క్ మిల్లర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మొదట్లో చేసిన ప్రతిపాదనల ప్రకారం కొత్త నిబంధనావళి అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట వారానికి కేవలం 24గంటలు మాత్రమే పనిచేయడానికి అవకాశముంటుంది.
అంతేగాక..ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యా సంస్థకు మారాలనుకునే ముందు, విద్యార్థులు కొత్త స్టడీ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొన్నాయి. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ విధానాన్ని కూడా కెనడా ఇటీవల రద్దు చేసింది. ఈ మార్పులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆ దేశానికి వెళ్లిన భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.