కీవ్/మాస్కో, ఆగస్టు 13: ఉక్రెయిన్‌తో గత రెండేండ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో రష్యాకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. రష్యాకు ఉక్రెయిన్ను నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులకు పాల్పడగా.. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా అదే పంథా తీసుకొన్నది. ఇటీవల రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు వెళ్లాయి. కుర్సు రీజియన్‌లో దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఒలెస్కాండర్ సిర్స్కీ సోమవారం వెల్లడించారు.
సరిహద్దును దాటి రష్యా భూభాగంలోకి చొరబడిన తర్వాత ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు తొలిసారిగా అధికారికంగా స్పందించారు. మరోవైపు రష్యా భూభాగంలోకి తమ బలగాలు వెళ్లిన అంశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ధ్రువీకరించారు. తాము అధీనంలోకి తీసుకొన్న భూభాగంలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రణాళికలు వేయాలని ఆదేశించినట్టు టెలిగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో సందేశంలో తెలిపారు.
రష్యా భూభాగంలోకి చొరబాటు సమయంలో కుర్సు రీజియన్‌లో ఉక్రెయిన్ బలగాలు రసాయనాల ఆయుధాలతో కూడిన షెల్స్‌ను ప్రయోగించాయని రష్యా ప్రభుత్వ మీడియా పేర్కొన్నది. ఈ మేరకు కుర్సు రీజియన్ గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ వెల్లడించినట్టు ఉటంకించింది. అయితే తన ఆరోపణలకు సంబంధించి స్మిర్నోవ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అనే దానిపై స్పష్టత లేదని రాయిటర్స్ పేర్కొన్నది. గత ఆరు రోజుల ఉక్రెయిన్ బలగాల దాడుల్లో కుర్సు రీజియన్‌లో 12 మంది పౌరులు మరణించారని, 1.21 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించామని గవర్నర్ స్మిర్నోవ్ పేర్కొన్నారు.
కుర్సు రీజియన్‌లోకి ఉక్రెయిన్ బలగాల చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. కీవ్‌పై మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఇది రష్యా స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమని, గట్టిగా జవాబిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ బలగాల చొరబాటును ఊహించని రష్యా.. అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇంకా ముందుకు రాకుండా అడ్డుకొనేందుకు అధిక బలగాలను కుర్సు రీజియన్‌కు తరలిస్తున్నది.